సభలో విజిల్స్, చిడతలు వాయించటం..టీడీపీ గందరగోళం అందుకే: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో అలజడి సృష్టించాలనే లక్ష్యంతో టిడిపి నేతలు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారంటూ, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల తీరును ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రతి అంశంపైనా ప్రభుత్వం సభ్యులకు వివరణ ఇచ్చిందని పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి కావాలని తెలుగుదేశం పార్టీ నేతలు శాసనసభ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

పోలవరంపై టీడీపీకి అనుమానాలుంటే చర్చలో ఎందుకు పాల్గొనలేదు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతి అంశంపై అధికార పార్టీ సుదీర్ఘ వివరణ ఇచ్చిందని, పోలవరం పై తెలుగుదేశం పార్టీకి అనుమానాలు ఉంటే చర్చలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. పోలవరం పై సీఎం జగన్ స్పష్టం చేసిన ప్రకటన చేశారని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని పేర్కొన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరోజు సభలో విజిల్స్ వేశారని, మరో రోజు చిడతలు వాయించారు అని, ఇలా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు కావాలనే సభలో గందరగోళం
ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి, కావాలనే ఈ విషయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు సభలో గందరగోళం సృష్టించారు అంటూ విమర్శలు గుప్పించారు. ఎక్సైజ్ విధానంపై కూడా చర్చలో తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొనలేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎవరి హయాంలో ఏపీలో మద్యం బ్రాండ్లు వచ్చాయో సీఎం వివరించారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

మద్యం బ్రాండ్లపై ఆధారాలతో చెప్పటంతో టీడీపీ నేతలకు మతిపోయింది
జంగారెడ్డిగూడెం వరుస మరణాలు అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు శవ రాజకీయాలు చేశారని, మద్యంపై స్వల్పకాలిక చర్చకు కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనుమతినిచ్చిన డిస్టిలరీ లతోపాటు బ్రేవరేజీల గురించి కూడా ఆధారాలతో సహా ప్రభుత్వం ప్రకటన చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

మూడు రాజధానులపైనా సభలో చర్చ..
ఇళ్ల పట్టాల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా వివరణ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మూడు రాజధానుల అంశం పై కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరిగిందని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఈ చర్చలో పాల్గొన్న పలువురు సభ్యులు పేర్కొన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించిన శ్రీకాంత్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు జరిగి తీరుతుందన్నారు.












Click it and Unblock the Notifications