యుటిగా హైదరాబాద్‌ను మళ్లీ తెరపైకి తెచ్చిన టిడిపి: జగన్, కెసిఆర్‌లపై వర్ల ఫైర్
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం (యుటి)గా చేయాలనే డిమాండ్‌ను తెలుగుదేశం పార్టీ మళ్లీ తెర మీదికి తెచ్చింది. ఓటుకు నోటు కేసు పరిణామాల నేపథ్యంలో దాన్ని తెర మీదికి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను పదేళ్లు యూటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.
యుటిగా చేయని పక్షంలో శాంతిభద్రతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించాలి కోరారు. టీడీపీని రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. హైదరాబాదు నుంచి తరిమికొడుతామంటే గవర్నర్ నరసింహన్ మాట్లాడడం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు.

రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి సెలవుపై ఎందుకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మరో నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు పొక్కినందుకే సెలవుపై వెళ్లారని కేసీఆర్ ఆదేశించినట్టు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. తెలుగు జాతికి జగన్, కేసీఆర్‌లు రాహుకేతువులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని జగన్ కోరిక అని, అందుకే తన ఎమ్మెల్యేలను కేసీఆర్‌కు అప్పగించారని వర్ల రామయ్య విమర్శించారు.












Click it and Unblock the Notifications