తెలంగాణాలో గంజాయి గుప్పు: వరంగల్ లో గంజాయి స్మగ్లర్ల అరెస్ట్, హైదరాబాద్ లో భారీ గంజాయి సీజ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ నుండి దేశంలోని అనేక రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకపక్క ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

తెలంగాణాలో భారీగా గంజాయి, లింగంపల్లి రైల్వేస్టేషన్లో 336 కేజీల గంజాయి సీజ్
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు ముఠాలు పట్టుబడడం తెలంగాణ రాష్ట్రంలో గంజాయి దందా ఎంతగా సాగుతుందో అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఒక ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 67 లక్షల విలువైన 336 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబైకి గంజాయి తరలిస్తున్న 14 మంది సభ్యుల ముఠా అరెస్ట్
గంజాయిని తరలిస్తున్న 14 మంది సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా, మిగతా వారంతా పురుషులు. అరకు నుంచి ముంబైకి వీరు గంజాయిని తరలిస్తున్నట్లుగా రైల్వే డిఎస్పి చంద్రభాను వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ వేదికగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో, ముఖ్యంగా రైలు మార్గాల ద్వారా అక్రమ రవాణా సాగిస్తున్నారన్న సమాచారంతో విశాఖ నుండి వచ్చే రైళ్లపై ప్రత్యేకమైన దృష్టి సారించామని, ఈక్రమంలోనే భారీగా గంజాయి పట్టుబడిందని రైల్వే డిఎస్పీ వెల్లడించారు.

వరంగల్ లోనూ గంజాయి స్మగ్లర్ల ముఠాను పట్టుకున్న పోలీసులు
ఇదిలా ఉంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ మరియు చెన్నరావుపేట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టుబడగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల నుండి సుమారు 5లక్షల 30వేల రూపాయల విలువగల 53కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ, ఒడిశా బోర్డర్ ల నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా
పోలీసులు అరెస్టు చేసిన వారిలో సోయం వీరబాబు, సమీర్ హల్దర్ ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు కాగా పరారైన వారిలో కోస్రా రాజు చింతూరు, ఈస్ట్ గోదావారి, ఆంద్రప్రదేశ్ మరియు మల్కాజ్గిరి ఒడిషా రాష్ట్రానికి చెందిన మొడం ముత్త, కొతన్ దుర్గలు వున్నారని సీపీ వెల్లడించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఈ ముఠా సులభంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లోని చింతలూరు, ఒడిషా రాష్ట్రంలోని మల్కాజ్ గిరి ప్రాంతాల్లో రహస్యంగా సేకరించిన గంజాయిని మధ్యవర్తుల ద్వారా తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు రహస్యంగా గంజాయిని తరలించేవారని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ కు 53 కిలోల గంజాయిని తరలించే యత్నం, ఇద్దరు అరెస్ట్, మరోముగ్గురు పరారీ
ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ కు తరలించేందుకు 53 కిలోల గంజాయిని ప్యాకెట్ల రూపంగా రెండు ద్విచక్ర వాహనాలపై రాజమండ్రి, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, నర్సంపేట, మీదుగా నెక్కొండకు వస్తున్నట్లుగా సమాచారం అందడంతో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఇద్దరు స్మగ్లర్లను పట్టుబడ్డారు. ముగ్గురు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా గంజాయి కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుచేస్తున్న గంజాయి ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా తీవ్రంగానే పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications