బియ్యం బస్తాల మాటున గంజాయి స్మగ్లింగ్; అల్లూరి జిల్లాలో మూడుకోట్ల విలువైన గంజాయి సీజ్!!
బియ్యం బస్తాల మాటున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అల్లూరి జిల్లాలో వాహన తనిఖీలలో పట్టుకున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో గంజాయి గుప్పుమంటుంది. గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దులో పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు గంజాయిని నిర్మూలించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, భారీ నిఘా పెట్టినా సరే గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఎవరికి దొరక్కుండా గుట్టు చప్పుడు కాకుండా కూరగాయల మాటున, బియ్యం బస్తాల మాటున విభిన్న మార్గాలలో గంజాయి దందా చేస్తున్నారు. ఎంత మంది పట్టుబడినా, ఎన్ని కేసులు పెడుతున్నా సరే గంజాయి దందా మాత్రం ఆగటం లేదు. తాజాగా అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు వద్ద రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు, మహారాష్ట్రకు చెందిన టాటా వాహనంలో బియ్యం బస్తాల మాటున ఉన్న 1700 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

పైన బియ్యం బస్తాలను వేసి గంజాయి పట్టుబడకుండా అడుగున జాగ్రత్తగా సెట్ చేసి బాహాటంగా రవాణా చేస్తున్నారు. అయితే అనుమానాస్పదంగా అనిపించి బస్తాలను తీసి తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే సరుకు పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వీరి నుంచి సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ గంజాయిని దారికొండ సమీపంలోని ఒరిస్సా సరిహద్దు నుంచి మహారాష్ట్ర కు చెందిన గంజాయి వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్టు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. అయితే దీని వెనుక ఇంకా ఎవరున్నారు. ఈ మార్గంలో ఇంకా ఎన్ని వాహనాలు ఈ విధంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఎవరెవరు ఈ దందా చేస్తున్నారు అన్న కూపీ లాగుతున్నారు ఏపీ పోలీసులు.












Click it and Unblock the Notifications