వంశీపై అసలు కేసుకు పక్కకు-కిడ్నాప్ కేసులో ఏ1, బెయిల్ వచ్చేనా ?
ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, రిమాండ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ఏ 71గా ఎఫ్ ఐఆర్ లో ఉన్న ఆయనపై తాజాగా కిడ్నాప్, బెదిరింపుల కింద ఏ1గా పోలీసులు నమోదు చేసిన కేసు మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్టు తర్వాత రిమాండ్ పై జైల్లో ఉన్న వంశీకి బెయిల్ లభించడం కూడా కష్టంగా మారబోతోంది.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఏ 71గా చేర్చారు. అయితే ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఆయనతో పాటు 87 మంది ఇతర నిందితులపైనా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ ఉన్నట్లుండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరై తనకూ ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పేశారు. దీంతో టీడీపీ ఉలిక్కిపడింది. అక్కడి నుంచి సీన్ మారిపోయింది.

వంశీతో పాటు 88 మంది నిందితులుగా ఉన్న గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న పార్టీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడని తెలుసుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఈ క్రమంలో తన సోదరుడిని వంశీ అనుచరులు బెదిరించి, డబ్బులిచ్చారని తెలుసుకుంది. దీంతో టీడీపీ నేతలు సత్యవర్ధన్ కుటుంబం సాయంతో మరో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కు కారకుడిగా వంశీతో పాటు మరో ఇద్దరిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు.
అయితే ఇప్పుడు వంశీ ముందున్న ఏకైక మార్గం బెయిల్ కోరడమే. అయితే ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న సత్యవర్ధన్ నే కిడ్నాప్ చేసి, బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని బెయిల్ ఇస్తే తిరిగి బెదిరించే అవకాశం ఉందని, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని ఇవాళ మరో కేసులో న్యాయమూర్తి ముందు హాజరు పేర్చనున్నారు. అదే సమయంలో వంశీ హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశముంది.












Click it and Unblock the Notifications