తెలంగాణలోనూ జగన్‌కు దెబ్బ: పార్టీకి గట్టు గుడ్‌బై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత గట్లు రామచంద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా అనంతరం అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతారని ఆయన అనుచరులు తెలిపారు.
ఇటీవలే కొందరు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మిగిలిన నేతలు కూడా పార్టీ వీడనుండడంతో తెలంగాణలో త్వరలో వైయస్సార్ కాంగ్రెసు భవిష్యత్తు తెలంగాణలో ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా గట్టు రామచందర్ రావుతో పాటు మరికొంత మంది తెలంగాణ నేతలు అలిగినట్లు వార్తలు వచ్చాయి.

షర్మిల పరామర్శ యాత్రలో ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చిత్రాలు తప్ప మరో నేత చిత్రాలు పోస్టర్లపై కనిపించకపోవడంతో వారు అలిగినట్లు చెప్పారు. దాంతో గట్టు రామచందర్ రావుతో పాటు మరికొంత మంది షర్మిల పరామర్శ యాత్రకు దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాస్తా ఉనికి చాటుకుంది. తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ అది కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన శాసనసభ్యులను కూడా పూర్తి స్థాయిలో వైయస్సార్ కాంగ్రెసు నిలబెట్టుకోలేకపోయిందనే ప్రచారం సాగుతోంది. దానికితోడు, గట్టు రామచందర్ రావు పార్టీని వీడడం ఇబ్బందికరమైన విషయమే. మొదటి నుంచి ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.












Click it and Unblock the Notifications