తెలిసిన వ్యక్తిని ఆటో తెమ్మంటే.. లాక్కెళ్లి గ్యాంగ్ రేప్
ఖమ్మం: బంధువుల ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి ఆటో తీసుకు రమ్మని కోరడమే ఆ బాలికకు శాపంగా మారింది. ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం టేకులపల్లి మండలం ఇప్పలచెలకకు చెందిన 17 ఏళ్ల బాలిక కోయగూడెం పంచాయతీ మద్రాసు తండాలోని తమ బంధువుల ఇంటికి గురువారం సాయంత్రం బయలుదేరింది. సీతారాంపురం స్టేజి వరకూ బస్సులో వచ్చి, తండాకు వెళ్లేందుకు అదే గ్రామంలో తనకు తెలిసన ఆటో డ్రైవర్ జగదీష్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకు రమ్మని కోరింది. జగదీష్ మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. వచ్చిన ఆటోలో బాలిక ఎక్కింది.

ఆటోలో డ్రైవర్ జగదీష్‌తోపాటు భూక్యా మధులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. సీతారాంపురం స్టేజి నుంచి బయలుదేరిన తరువాత కొండంగులబోడు, మద్రాసు తండాల మధ్య యువకులు ఆటోను నిలిపివేశారు. బాలికను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి గురైన బాలిక మద్రాసు తండా వెళ్లకుండా అదేరోజు రాత్రి తిరిగి ఇప్పలచెలకకు చేరింది. మరుసటి రోజు నుంచి బాలిక ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు సముదాయించి విషయం అడిగారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. శనివారం టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రాజిరెడ్డి తెలిపారు. బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications