నిరుద్యోగులు.. 'బీ రెడీ' : ఏపీలో కొత్త కొలువులకు నోటిఫికేషన్స్
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రభుత్వం తరుపు నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఢీలా పడ్డ నిరుద్యోగులకు ఇప్పుడో శుభవార్త. నిరీక్షణకి తెర దించుతూ త్వరలోనే వరుస నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్దమవుతోంది.
ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు 20250 గా లెక్క తీసిన ప్రభుత్వం.. పోస్టుల భర్తీకి కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో 8వేల పోస్టులు పోలీసు శాఖకు సంబంధించినవి కాగా.. మిగతా 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి చూస్తే.. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా 1100 పోస్టుల భర్తీకి త్వరలో ప్రభుత్వం ప్రకటన జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, ఏడాది చివరి వరకు ఈ తతంగం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది.
ఇక ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో మార్పులు చేసిన ప్రభుత్వం, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో డిపార్ట్ మెంటల్ పోస్టుల కోసం నిర్వహించే విభాగాన్ని ఇప్పటికే ఓపెన్ చేశారు. దీని ద్వారా జూన్ లో పరీక్ష రాయబోవు అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు.
అలాగే డైరెక్ట్ రిక్రూట్ మెంట్లకు సంబంధించిన విభాగాలను మొదటి నోటిఫికేషన్ ద్వారా ఓపెన్ చేయనున్నట్టుగా సమాచారం. గ్రూప్ -1,2,3,4 లో ప్రతిపాదిత సిలబస్ లపై వచ్చిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల నిపుణుల పరిశీలనకు పంపించింది ఏపీపీఎస్సీ. దీన్ని బట్టి సిలబస్ లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications