ఏపీలో వాహనదారులకు శుభవార్త.. రూ.2500 కోట్లతో మీకోసం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రహదారులపై ఫోకస్ చేసినట్టుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా గుంతలరహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం అన్నారు. గత ప్రభుత్వ రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, రహదారులు మొత్తం గుంతలమయంగా మారాయని గుర్తు చేశారు.
గుంతల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
గత ఐదేళ్ల కాలంలో రోడ్లను కనీసం రెన్యువల్ కూడా చేయకుండా రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రహదారులను గత వైసిపి ప్రభుత్వం నాశనం చేసింది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు నెలల కాలంలో ఒక వెయ్యి 81కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం, ఆర్ అండ్ బీ శాఖ పైన ప్రజల్లో సానుకూలత పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ కృషి
అయితే ఇటీవల తుఫాను ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో కొంతమేర రోడ్లు బాగానే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ, గుంటూరు జిల్లాలలో రహదారులు పాడయ్యాయి అని, వాటి మరమ్మతులపైన దృష్టి సారిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గతంలో అద్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులకు నేడు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు.
రహదారుల పనులకు దాదాపు 2500 కోట్ల రూపాయలు
రహదారుల అభివృద్ధి కోసం దాదాపు 2500 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ, నిధులను సమీకరించుకొని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ధిపై పరిశీలన
రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని, రహదారుల అభివృద్ధికి ఎన్ డి బి, నాబార్డ్ వంటి బ్యాంకుల ద్వారా చర్యలు చేపడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజల పైన భారం పడకుండా రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన ఆయన, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం రోడ్ల విషయంలో చర్యలు చేపడుతున్నట్టు గా తెలిపారు.












Click it and Unblock the Notifications