సీఎం జగన్ కీలక ప్రకటన - పెన్షన్ రూ 2750కి పెంపు : చంద్రబాబుకు ఫేర్ వెల్ క్యాలెండర్ ఇదే..!!
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభా వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేసారదు. తమ మూడేళ్ల పాలనలో ఇప్పటికే 95 శాతం హామీలు పూర్తి చేసామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. అందులో భాగంగా ఇప్పటికే రూ 2500 గా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ ను రూ 2,750 కు పెంపు పైన ప్రకటన చేసారు. వచ్చే జనవరి నుంచి పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని వెల్లడించారు. 2022-23 ఆర్దిక సంవత్సరంలో ముందుగానే ఏ నెలలో ఏ పధకం అమలు చేయనున్నదీ..క్యాలెండర్ ప్రకటించారు.

ఆదాయం తగ్గినా దీక్ష మారలేదు
సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వెల్లడించారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని చేయలేదని ఎద్దేవా చేసారు. నా వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతోందని జగన్ చెప్పారు. గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు ఇప్పుడు మా వెంట ఉన్నారంటూ జగన్ ధీమా వ్యక్తం చేసారు. ప్రతిపక్షం ఉనికి కోసం డ్రామాలు ఆడుతోందని చెప్పుకొచ్చారు. అన్నీ గమనిస్తున్న ప్రజలు..ప్రతీ ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారని వివరించారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు.

2022-23 పధకాల అమలు క్యాలెండర్
అందులో భాగంగా.. వచ్చే నెల ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు అమలు చేస్తామని ప్రకటించారు. మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూన్‌లో అమ్మ ఒడి పథకం అమలు పైన ప్రకటన చేసారు. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు పధకాలు అమలు చేస్తామన్నారు. ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్, నేతన్న నేస్తం అమలు జరుగుతాయని సీఎం చెప్పారు. ఇక, సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత అమలు కానుంది. అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా ఇస్తామని సీఎం ప్రకటించారు. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.

చంద్రబాబుకు ఫేర్ వెల్ క్యాలెండరంటూ
డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు అమలు చేస్తామని చెప్పారు. వచ్చే జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు అమలు కానున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు అమలుకు నిర్ణయించారు. ఇక, మార్చిలో వసతి దీవెన అమలు అవుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఈ క్యాలెండర్ పేదలకు సంక్షేమ క్యాలెండర్ అని.. చంద్రబాబుకు ఫేర్ వెల్ క్యాలెండర్ గా జగన్ అభవర్ణించారు. దీనిని టీడీపీ జీర్ణించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత సభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో సభ నిరవధికంగా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications