వాహనదారులకు కీలక అలెర్ట్.. ఇకపై 24/7 మీ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్!
వాహనదారులకు ఏపీ రవాణా శాఖ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సేవలు పొందుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాహన్, సారథి పోర్టల్స్ లో అనేక సేవలను వినియోగించుకునే వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఆధార్ వివరాల రీ చెకింగ్, హెచ్‌ఎస్‌ఆర్‌పీ వివరాల నమోదు, సర్వర్ నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఫోన్ కాల్స్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొనారు . ఈ కంట్రోల్ రూమ్ నంబర్ 9281607001. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు.
వాహన యాజమాన్య బదిలీ సమయంలో సంబంధిత RTA కార్యాలయాన్ని ఎంపిక చేయడంలో ఎదురైన సమస్య ఇప్పుడు పరిష్కారమైందన్నారు. ఆధార్ వివరాలు డ్రైవింగ్ లైసెన్స్‌తో సరిపోని వారు ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాత వాహనాల యజమానులు హెచ్‌ఎస్‌ఆర్‌పీ వివరాలు VAHAN పోర్టల్‌లో కనిపించకపోతే సంబంధిత RTO కార్యాలయాన్ని సంప్రదించి అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు.
కొత్తగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లు అమర్చాల్సిన వాహనదారులు సంబంధిత వాహన తయారీ సంస్థ అధీకృత డీలర్‌ను సంప్రదించవచ్చన్నారు.ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు సెప్టెంబర్ 27 నుంచి ఇంటి నుంచే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. అక్టోబర్ 8 నాటికి ఈ సదుపాయం ద్వారా 2,620 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 138 మంది ఉత్తీర్ణులు కాలేదని వివరాలు వెల్లడించారు. ఇంటి నుంచే పరీక్ష రాయడం వల్ల ట్రావెల్ ఖర్చు, సమయం ఆదా అవుతుందని అన్నారు.
రవాణా శాఖ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు సంకోచించకుండా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ చర్యలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సహాయపడతాయని అంచనా.













Click it and Unblock the Notifications
