బాలయ్య తొడకొడితే.. వందేభారత్ రైలైనా ఆగాల్సిందే, రీల్ కాదు రియల్!
రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ఏపీ ప్రగతికి దోహదం చేస్తుంది రైల్వే. ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం 7 వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ రైలు రాష్ట్రంలోని వివిధ స్టేషన్లలో ఆగుతుండగా, అదనపు హాల్టింగ్ ల కోసం ఏపీలోని ప్రజాప్రతినిధుల నుండి విజ్ఞాపనలు వెల్లువగా మారాయి.
వందే భారత్ రైళ్ళు నడిచే చోట అదనపు హాల్టింగ్ లు
ఎంపీలు ,ఎమ్మెల్యేల నుండి విజ్ఞప్తుల మేరకు భారతీయ రైల్వే కూడా అదనపు హాల్టింగ్ ల విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ విశాఖపట్నం రెండు రైళ్లు, కాచిగూడ యశ్వంతపూర్ బెంగళూరు మీదుగా, విజయవాడ చెన్నై, విశాఖపట్నం దుర్గ్, విశాఖపట్నం భువనేశ్వర్ మార్గాలలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ వందే భారత్ రైలు నడిచే మార్గాలలో చాలాచోట్ల అదనపు హాల్టింగ్ లను ఏర్పాటు చేశారు.

హిందూపురానికి రైల్వే శుభవార్త
తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్లో కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ రైలును ఆపాలని అభ్యర్థనలు వచ్చాయి. బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం నుండి వచ్చిన అభ్యర్థనలకు రైల్వే సానుకూలంగా స్పందించింది. స్థానిక ఎంపీ బీకే పార్థసారథి రైల్వే సహాయ మంత్రి సోమన్న కు ఈ విషయం మీద అభ్యర్థన తెలియజేయగా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు . దీంతో హిందూపురం లోను వందే భారత్ రైలును ఆపడానికి రైల్వే సుముఖంగా ఉంది.
పదిరోజుల్లో వందే భారత్ హాల్టింగ్ పై స్పష్టత
మరో పది రోజుల్లో కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హిందూపురంలో ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. హిందూపురంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి రైల్వే సహాయ మంత్రి సోమన్న కు అదనపు హాల్టింగ్ గురించి విజ్ఞప్తి చేశామని, హిందూపురంలో వందే భారత్ రైలు ఆగడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
హిందూపురం కేంద్రంగా రైల్వే అభివృద్ధి పనులు
పది రోజుల్లో దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు హిందూపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా వేగవంతం అయ్యాయని తెలిపారు. ఇక బళ్లారి నుండి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి అని పేర్కొన్నారు. చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద 29కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, సంవత్సర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యం ఉందని అన్నారు.
హిందూపురంపై బాలయ్య ప్రత్యేక శ్రద్ధ
హిందూపురం నియోజకవర్గం పైన బాలయ్య ప్రత్యేకమైన దృష్టి సారించారని, 92 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ పార్థసారథి వెల్లడించారు. హిందూపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications