బుచ్చయ్య దారెటు - కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏం చేయబోతున్నారు. జనసేనాని పవన్ రాజమండ్రి పర్యటనలో రాజమండ్రి రూరల్ సీటు జనసేనకే అని తేల్చేసారు. కందుల దుర్గేష్ పోటీ చేస్తారని స్పష్టం చేసారు. దీంతో ఇప్పుడు బుచ్చయ్య చౌదరి ఆగ్రహంతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఉంటాయని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఈ సీటు వ్యవహారం పైన ఇప్పటి వరకు టీడీపీ నుంచి స్పందన లేదు.
పొత్తు లెక్కలు : టీడీపీ, జనసేనలో భాగంగా సీట్లు పంపకాలు కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి. టీడీపీలో సీనియర్లకు సీట్లు దక్కటం కష్టంగా మారింది. పొత్తులో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరిలో సీట్లను పవన్ ఖాయం చేసారు. విశాఖలో నాలుగు స్థానాలకు ఇంఛార్జ్ లను నియమించారు. టీడీపీతో కలిసి అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేసారు.

దీని ద్వారా నాలుగు సీట్లు జనసేన పోటీ చేసేవి ఖరారు అయ్యాయి. ఇందులో పెందుర్తి, గాజువాక, యలమంచిలి, భీమిలి స్థానాలు ఉన్నాయి. ఇటు తూర్పు గోదావరిలో ఇప్పటికే రాజోలు, రాజా నగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ తాజాగా రాజమండ్రి రూరల్ సీటులోనూ జనసేనే పోటీకి నిలుస్తుందని స్పష్టత ఇచ్చారు.
బుచ్చయ్య కు షాక్ : రాజమండ్రి రూరల్ నంచి కందుల దుర్గేష్ అభ్యర్దిత్వం ఖరారు చేస్తూ...గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడాలని సూచించారు. అయితే దుర్గేష్ తానే అభ్యర్దిగా రాజమండ్రి రూరల్ లో పోటీకి దిగుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీని పైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండి పడుతున్నారు. ఈ పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను టీడీపీ ఆవిర్భావ సభ్యుడినని చెప్పుకొచ్చారు.
తాను రాజమండ్రి నుంచి పోటీ చేయటం ఖాయమని మరోసారి స్పష్టం చేసారు. త్యాగాలు తామే కాదని..జనసేన కూడా చేయాలని వ్యాఖ్యానించారు. రాజానగరం సీటు తీసుకున్న జనసేన రాజమండ్రి రూరల్ తీసుకోవటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఏవరు ఏం చెప్పినా తాను పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేసారు.

టీడీపీ నిర్ణయం ఏంటి : జనసేన నిర్ణయం పైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఈ నిర్ణయం పైన ఎలాంటి స్పందన రాలేదు. విశాఖ నగరంలో పవన్ ప్రకటించిన సీట్ల పైన సీనియర్లలో అంతర్మధనం జరుగుతోంది. చంద్రబాబుతో చర్చించేందుకు సిద్దమయ్యారు.
రాజమండ్రి రూరల్ జనసేనకు ఇస్తే రాజానగరం సీటు టీడీపీకి ఇచ్చేలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజానగరం నుంచి గోరంట్లకు అవకాశం ఇస్తారనే వాదన తాజాగా తెర మీదకు వచ్చింది. అయితే, అక్కడ టీడీపీ, జనసేన నుంచి పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే రాజానగరంలో జనసేన ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. దీంతో, బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుంటే ఆయన నిర్ణయం ఏంటదనేది ఇప్పుడు జిల్లాలో, పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications