సచివాలయ ఉద్యోగులకు షాక్ - వేతనాల్లో భారీ కోత : సమస్య వారిది..నష్టం వీరికి..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో వారు ఊహించని విధంగా ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందింది. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబర్ జీతంలో 10 నుంచి 50శాతం వరకు తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది.

బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు
వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని డ్రాయింగ్, డిస్పర్స్‌మెంట్ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆదేశించింది. బయోమెట్రిక్ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు మండల అధికారులకు వినతులు ఇచ్చారు.

సమస్యలను పరిష్కరించకుండా నిర్ణయాలా
సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డాటాను రూపొందించాలని కోరారు. సిగ్నల్ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానం సరిగా పనిచేయక పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్న విషయాన్ని అధికారులకు నివేదించారు. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే రెగ్యులర్ వేతనాలు అందుతాయని భావిస్తున్న సమయంలో..ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం పై ఆవేదన
అయితే, బయోమెట్రిక్ తో సాంకేతిక సమస్యలు ఉండటంతో... దానితో సంబంధం లేకుండా గతంలో ఇచ్చిన విధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వ పధకాలు..కార్యక్రమాలను ప్రజలకు చేరవేయటంలో సచివాలయ ఉద్యోగులు..ప్రధానంగా వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ సమీక్షలోనూ సీఎం జగన్ సచివాలయాల ప్రస్తావన..వాటి భాగస్వామ్యం గురించి ప్రస్తావిస్తున్నారు.

నిర్ణయాన్ని మార్చుకుంటారా
పాలనలో కీలకంగా మారిన సచివాలయాల ఉద్యోగుల విషయంలో ఇటువంటి ప్రతిపాదనలు తీసుకురావటం..జీతాల్లో కోతలు పెట్టటం వంటి వాటి పైన వారు ఆ:దోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన ప్రభుత్వం స్పందించి తాజా ఉత్తర్వులు విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నారు. దీని పైన ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంటుందా లేక, ఇచ్చిన ఆదేశాలే అమలవుతాయా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications