డ్వాక్రా మహిళలకు తీపికబురు.. లక్ష రాయితీతో పాటు తక్కువ వడ్డీతో వాటి రుణాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఆర్ధిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి మరో ముఖ్యమైన సహాయం అందుతోంది. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే దిశగా ఇప్పటికే డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేయటంతో పాటు, అనేక రంగాలలో మహిళలను భాగస్వామ్యం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
ఎలక్ట్రిక్ ఆటోలు మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ప్రత్యేక రాయితీలు
ఇప్పటికే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందుతున్న డ్వాక్రా మహిళలకు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు కూడా ప్రత్యేక రాయితీలు, సులభ రుణ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ .వీటి ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ఈ-ఆటోల విషయంలో ప్రభుత్వం రూ.లక్ష రాయితీని ప్రకటించింది.

ఈ ఆటోపై రాయితీతో పాటు తక్కువ వడ్డీ
సాధారణంగా ఈ-ఆటో ధర సుమారు రూ.4.5 లక్షలు ఉంటుంది. అయితే దీనిపైన ప్రభుత్వం దాదాపు లక్ష రూపాయలవరకు రాయితీ కల్పిస్తుంది. రాయితీ తర్వాత రూ.3.5 లక్షలకే కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణం అందుతుంది. దీనితో పాటు సులభమైన వాయిదాల్లో చెల్లించే వీలు కూడా ఉంటుంది. ఈ వాహనాలను డ్వాక్రా సంఘాలు లేదా వారి కుటుంబ సభ్యులు నడిపించి ఆదాయం పొందవచ్చు.
డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా రాయితీ
వీటితో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తాయి. ఇక ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. స్కూటర్ కొనుగోలుపై రూ.12 వేల రాయితీ లభిస్తుంది. దీనికి కూడా బ్యాంక్ రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీ వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ సౌకర్యం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
డ్వాక్రా మహిళలకు ప్రయోజనం.. అప్లై చేసుకోండి
రాయితీతో పాటు లోన్ పైన తక్కువ వడ్డీ కూడా ఉండటంతో డ్వాక్రా మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే మెప్మా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. గతంలో కొంతమంది ఇప్పటికే ఈ సౌకర్యం పొందారు. ప్రస్తుతం మరికొంతమందికి అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్కూటర్ లు, ఈ ఆటోల కోసం దరఖాస్తు చేసుకోండి.













Click it and Unblock the Notifications