4 నెలలు ఓపిక పట్టండి, ముంచేందుకే మరొకటి: జగన్
హైదరాబాద్: నాలుగు నెలలు ఓపిక పట్టాలని, అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న జగన్ బాధితులను ఓదార్చుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన నరసాపురం మండలం మోడీ తదితర ప్రాంతాల్లో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరుసగా రెండు తుఫాన్లు వచ్చి రైతులను నిండా ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో తుఫాను ముంచేందుకు వస్తోందన్నారు. వరుస తుఫాన్లతో రైతు వెన్ను విరిగిందన్నారు.

రైతులకు రుణమాఫీ చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్నింటిని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలలు ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జగన్ చెప్పారు.
జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి తన పర్యటనను ప్రారంభించారు. లక్ష్మణేశ్వరం, సార్వా గ్రామాల్లో దెబ్బతిన్న వరిని పరిశీలించారు. పలువురు రైతులు, ప్రజలు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకున్నారు. ఒకే నెలలో రెండు తుఫాన్లు తమను రోడ్డున పడేశాయని, పంట పూర్తిగా కొట్టుకుపోయిందని కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications