కఠిన నిర్ణయాలే, బీజేపికి ఓట్లు రాకున్నా..: వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాల్సిందేనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం స్పష్టం చేశారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ పలు పార్టీలు హామీలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ అంశం పైనా ఆయన స్పందించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అందరు స్వస్తీ పలకాలని హితవు పలికారు. తమకు ఓట్లు వచ్చినా రాకున్నా మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు. గాడి తప్పిన వ్యవస్థను పట్టాలెక్కించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.

ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని... కొన్ని చేదు గుళికలు మింగక తప్పదన్నారు. కాంగ్రెసు పార్టీ విధానాల వల్లనే ధరలు పెరిగాయన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఆదివారం హైదరాబాదుకు రానున్నారు. నగరంలోని నేషనల్ పోలీస్ అకాడమీలో స్పెషల్ టాక్టిక్స్ వింగ్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. తర్వాత టీఏసీ ట్రైనింగ్ డెమోను వీక్షిస్తారు. అనంతరం జాతీయ భద్రత అనే అంశంపై జరిగే సెమినార్ లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.












Click it and Unblock the Notifications