రైల్లో బెజవాడ టు హైదరాబాద్ ఐదున్నర గం.ల్లో, ప్రమాదం జరిగితే భూమిలోకి బోగీలు!
హైదరాబాద్: హైదరాబాద్ - విజయవాడ మధ్య రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశ పెడుతోంది. ఈ రైలును విజయవాడలో 20వ తేదీన రాత్రి ఎనిమిదిన్నర గంటలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు.
ఈ రైలు వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగుల పనివేళలకు అనుకూలంగా ఉండనుంది. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగులకు, ఇతర ప్రయాణీకులకు ఈ రైలు వేళలు సౌకర్యవంతంగా ఉంటాయి. హైదరాబాద్ - విజయవాడకు ఐదున్నర గంటల్లోనే రైలులో చేరుకోవచ్చు.
ఈ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యాధునిక 'ఎల్‌హెచ్‌బీ' బోగీలతో పట్టాలు ఎక్కనుంది. మొత్తం 14 బోగీలు ఉంటాయి. రెండు ఏసీ ఛైర్ కార్, పది సెకండ్ సిట్టింగ్ బోగీలు కలుపుకొని ప్రయాణికులకు 12 బోగీలు ఉంటాయి. విజయవాడ-హైదరాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు.

ఇది 22న పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కాగా, సాధారణ బోగీలు ఉండే రైలుతో పోలిస్తే ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మన్ బుష్) బోగీల రైలు ఆకృతి ఆధునికంగా ఉంటుంది. సాధారణ బోగీలతో పోలిస్తే వీటిలో సీట్ల సంఖ్య అధికం. ప్రయాణంలో శబ్దం తక్కువగా వస్తుంది.
ఏదైనా ప్రమాదం జరిగితే బోగీలు భూమిలోకి కూరుకుపోతాయి. దీనివల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ బోగీల్లో పర్యావరణ అనుకూల మరుగుదొడ్లు ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్, ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ బోగీలే ఉన్నాయి. కొత్త ఎల్‌హెచ్‌బీ బోగీలు రాలేదు కాబట్టి అందుబాటులో ఉన్న ఇతర బోగీలతో ప్రారంభించనున్నారు.
ఈ రైలు విజయవాడ నుంచి గుంటూరు, నల్గొండ, బీబీనగర్ మీదుగా సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రైలుకు 12796, విజయవాడ నుంచి సికింద్రాబాద్ చేరుకునే రైలుకు 12795 నంబర్లను రైల్వేశాఖ కేటాయించింది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఇది అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications