స్వగ్రామంలో.. ఎడ్లబండిపై సీజేఐ ఎన్వీ రమణ - ఏపీ ఎంట్రన్స్ లో ఘన స్వాగతం : రేపు సీఎం జగన్ మీట్...!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించే సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ నుంచి దారిపొడవున వున్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. హైకోర్టు రిజిస్టార్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు..అధికారులు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. పలువురు స్వచ్చంగా తరలి వచ్చిన ప్రజలు..విద్యార్ధులు ఆయనకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు.
సీజేఐ హోదాలో తొలి సారి..ఘన స్వాగతం
అక్కడ నుంచి సీజేఐ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. సీజేఐ కు ప్రభుత్వం నుంచి స్వాగతం పలికేందుకు అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ,ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ పై పూలవర్షం కురిిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపు తో మేళా తాళాలతో,కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు.
గ్రామంలో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లి
ఊరేగింపు కు ముందు నిలిచిన అలంకృత మైన అశ్వాలు అందరిని కనువిందు చేశాయి. గ్రామంలోని దేవాలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామంలో పౌర సన్మానం ఏర్పాటు చేసారు. ఈ సాయంత్రం ఆయన గుంటూరు జిల్లాకు వెళ్లనున్నారు. సుప్రీం న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఆదివారం సీజేఐ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవ్వనున్న తేనేటి విందుకు హాజరవుతారు.

రేపు సీజేఐ ను కలవనున్న సీఎం జగన్
ఈ సమయంలో సీఎం జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించనున్నారు. ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ న్యాయమూర్తుల సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. నేలపాడులోని హైకోర్టులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు హాజరు కానున్నారు. ఆ సాయంత్రం నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు పయనం కానున్నారు.












Click it and Unblock the Notifications