El Nino: ఏపీకి పెరుగుతున్న ముప్పు..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలో ఎల్ నినో (El Nino) తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 2.44 లక్షల హెక్టార్లలో పంటలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలతో సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో ఎల్ నినో ముప్పుపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్కే సిబ్బందితో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎల్ నినో సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశ చేశారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టాలంటూ అధికారుల్ని ఆదేశించారు. హైరిస్క్ ఆర్ఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను ఆదుకునేందుకు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఫోకస్ పెట్టాలన్నారు. ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా అధికారులు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. అలాగే స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఎల్ నినో అంశంపై గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగును ప్రొత్సహించడంతో పాటు, డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటలను సాగు చేసేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వర్షాభావ పంటల సాగు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును చేపట్టాలన్నారు.














Click it and Unblock the Notifications
