టీడీపీ నన్నూ అడిగింది .. ఫోన్ చేస్తే.. క్రాస్ ఓటింగ్ పై ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన కామెంట్స్..
గుంటూరు : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడి వారం కావస్తుండటంతో ఒక్కొక్కరుగా అప్పుడేం జరిగిందో బయటపెడుతున్నారు. ఇన్నాళ్లూ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నిస్తే మాత్రం వీరిదగ్గర సమాధానం లేదు. తాజాగా టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ క్రాస్ ఓటింగ్ ఆఫర్ వచ్చిందంటూ బాంబుపేల్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తనను సంప్రదించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు తనను వారం రోజులుగా సంప్రదించారన్నారు. వారు తనను స్వయంగా కలిశారనన్నారు. తాను ఒప్పుకుంటే వాళ్లతో, వీళ్లతో మాట్లాడిస్తామని చెప్పారని వెల్లడించారు.స్వయంగా ఆ పార్టీలోని పెద్దలు తనకు ఫోన్ చేసినా తాను ఫోన్ కూడా ఎత్తలేదన్నారు. కావాలంటే తన కాల్ డేటా చూసుకోమన్నారు. అలాగే తనకు ఫోన్ వచ్చిన నంబర్ ను కూడా ఓ పేపర్ పై రాసి మీరే తీసుకోమని మీడియా ను కోరారు. ఈ నెంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు.

తనను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు సంప్రదించినా వారికి మద్దతిచ్చే పరిస్ధితి లేదన్నారు. తాను ఆ పార్టీకి దూరం జరిగి మూడు సంవత్సరాలు మూడు నెలల అయిందన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే నీచమైన రాజకీయాలు చేయలేదని మద్దాలి గిరి చెప్పారు. తమ మీద నిందలు వేస్తున్నారనే తాను ఈ విషయాన్ని చెబుతున్నాన్నారు. చంద్రబాబు అడ్డదారిలో ఎలా అధికారంలో వచ్చారనేది అందరికీ తెలుసునని గిరి తెలిపారు.
టీడీపీ నేతలు సరైన గౌరవం ఇవ్వకపోవడంతోనే ఆ పార్టీని వీడినట్లు మద్దాలి గిరి తెలిపారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాటంటూ గిరి విమర్శలు చేశారు. జగన్‌పై అభిమానంతోనే తాము వైసీపీలో చేరామన్నారు. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణమని మద్దాలి గిరి ఆరోపించారు. తాను తన వాళ్లు అనే నైజం చంద్రబాబుది అన్నారు. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతానని అనడం హాస్యాస్పదంగా ఉందని మద్దాలి గిరి ఎద్దేవా చేశారు. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారని శ్రీదేవిని ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications