‘108’పై ఎన్టీఆర్ ఫొటో: ఆసక్తి చూపని జివికె

ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్.. జివికె ప్రతినిధులతో మాట్లాడారు. 108 అంబులెన్స్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం చిహ్నం మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినందున 108 అంబులెన్స్‌లపై ఎన్టీఆర్ చిత్రపటాన్ని ముద్రించాలని శ్రీనివాస్ చెప్పారు.
కాగా, మంత్రి సూచనకు జివికె ప్రతినిధులు సానుకూలంగా స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడితో సమావేశమై జివికె ప్రతినిధులు తన నిర్ణయానికి అంగీకరించడం లేదని తెలియజేశారు.
108అంబులెన్స్ సేవల కోసం ప్రభుత్వం 95శాతం ఖర్చు భరిస్తుండగా.. కేవలం 5శాతం మాత్రమే జివికె చెల్లిస్తోందని శ్రీనివాస్ ఆర్థికమంత్రి యనమలకు తెలిపారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూచనలను జివికె ఎందుకు పాటించదని అన్నారు.
ఒకవేళ ఎన్టీఆర్ చిత్రపటాన్ని 108వాహనాలపై ముద్రించేందుకు జివికె అంగీకరించకపోతే 108 వాహనాల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం, జివికె సంస్థ సమానంగా పంచుకోవాలని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన సూచనలను తీసుకోవాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మంత్రి శ్రీనివాస్‌కు సూచించారు.
ఆ తర్వాత ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిసి సమస్యను వివరించారు. సిఎం సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నందున ఈ సమస్యపై తర్వాత చర్చిద్దామని మంత్రికి సూచించినట్లు తెలిసింది. అంతకుముందు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, జివికెల భాగస్వామ్యం సమీక్షిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications