గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ అరుదైన రికార్డు-దేశంలోనే తొలిసారి..!
ఏపీలో ఏకైక మహానగర పాలక సంస్థగా ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ) ఇవాళ మరో అరుదైన ఘనత అందుకుంది. కూటమి సర్కార్ హయాంలో పాలక వర్గం మార్పు తర్వాత అభివృద్ధిలో వేగంగా అడుగులేస్తున్న జీవీఎంసీకి ఓ విషయంలో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. దీంతో జీవీఎంసీ జాతీయ స్ధాయిలో రికార్డు సృష్టించినట్లయింది.
విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి రూ.498కోట్ల రుణాన్ని తీసుకునేందుకు వీలుగా ఇవాళ ఓ ఒప్పందం జరిగింది. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ ఈ రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు.

విశాఖపట్నంలోని మధురవాడ జోన్-2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. దీనికి మొత్తం రూ.553 కోట్లు వ్యయం కానుంది. ఇందులో రూ.498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు.

త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్ - లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం - నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు. నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భజలాలు కలుషితం కావు, పర్యావరణానికి మేలు చేస్తుందని, వరద నీటి నిర్వహణు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications