ఊళ్లోనే శశికళ, అనీష్ అంత్యక్రియలు: ఆ టెక్కీ భర్త డుమ్మా, స్పృహ తప్పిన తల్లి
అమెరికాలో హత్యకు గురైన టెక్కీ భార్య, కుమారుల శవాలకు ప్రకాశం జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. కూతురు, మనవడి శవాలను చూసి శశికళ తల్లి స్పృహ తప్పి పడిపోయారు.
విజయవాడ: అమెరికాలో హత్యకు గురైన శశికళ, ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి అంత్యక్రియలు జరిగాయి. ప్రకాశం జిల్లాలోని శశికళ భర్త స్వగ్రామంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. నిజానికి, వారి మృతదేహాలతో పాటు శశికళ భర్త హనుమంతరావు స్వగ్రామానికి వస్తాడని తొలుత భావించారు.
కానీ ఆయన ఆమెరికాలోనే ఉండిపోయారు. న్యూజెర్సీలోని బర్లింగ్టన్ కౌంటీలో గల మేపుల్ షేడ్‌లోని మిడోస్ అపార్టుమెంటులో శశికళ, అనీష్ సాయి కత్తిపోట్లకు గురై మరణించిన విషయం తెలిసిందే. హంతకులను గుర్తించడంలో అమెరికా పోలీసులు స్వల్ప ప్రగతి సాధించినట్లు చెబుతున్నారు.
విజయవాడలోని దుర్గాఘాట్‌లో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో మృతదేహాలను శశికళ తల్లిదండ్రులు, ఆమె బంధువులు కొద్ది సేపు చూశారు.

స్పృహ తప్పి పడిపోయిన శశికళ తల్లి
అమెరికాలో హత్యకు గురైన శశికళ, అనీష్ మృతదేహాలు శనివారంనాడు హైదరాబాదు నుంచి ప్రకాశం జిల్లాలోని తిమ్మరాజుపాలెం గ్రామం చేరుకున్నాయి. ఇది శశికళ భర్త హనుమంతరావు స్వగ్రామం. తన కూతురు, మనవడి శవాలను చూసి కృష్ణకుమారి స్పృహ తప్పి పడిపోయారు.

అంత్యక్రియలు చేసిన హనుమంతరావు తండ్రి...
తన కుమారుడు హనుమంతరావు భార్య, కుమారుడు శశికళ, అనీష్ సాయిల అంత్యక్రియలను నర్రా సుబ్బారావు నిర్వహించారు. వారి హత్యలో హనుమంతరావు పాత్ర ఉందని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దాన్ని నర్రా సుబ్బారావు ఖండిస్తున్నారు.

పెద్ద యెత్తున చేరిన గ్రామస్థులు...
ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శశికళ, అనీష్ సాయిల అంత్యక్రియలకు పెద్ద యెత్తున గ్రామస్థులు హాజరయ్యారు. అంత్యక్రియలు ప్రశాంతంగా జరగడానికి వారు సహకరించారు. కాగా, శశికళది, అనీష్ సాయిది జాత్యహంకార హత్య అని హనుమంతరావు బంధువులు అంటున్నారు.

వివాహేతర సంబంధంపై సాక్ష్యమే లేదు...
హత్యలు జరిగినప్పుడు తన కుమారుడు హనుమంతరావు ఇంట్లోనే లేడని సుబ్బారావు చెప్పారు. ఆ విషయాన్ని అమెరికాలో పోలీసులు కూడా ధ్రువీకరించినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడికి వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలపై పోలీసులకు కూడా ఏ విధమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications