జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలి - సీబీఐ దత్తపుత్రుడు : కాపుసంక్షేమ సేనాని కామెంట్స్..!!
ముఖ్యమంత్రి లక్ష్యంగా రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. కేబినెట్ విస్తరణ తో సీఎం జగన్ 2024 ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన సైతం తమ విమర్శలకు పదును పెడుతోంది. తాజాగా.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసారు. కొంత కాలంగా ఆయన టీడీపీలో ఉంటారా లేదా అనే సందిగ్ధత నడుమ..పరోక్షంగా చంద్రబాబుతోనే కొనసాగుతాననే సంకేతాలు ఇచ్చారు. ఇక, ఇప్పుడు కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు చెగోండి హరిరామజోగయ్య సీఎం జగన్ పైన విమర్శలు గుప్పించారు.

సీబీఐ దత్తపుత్రుడు అంటూ
నవరత్నాలు అనేక మందికి అందిస్తున్నామని సీబీఐ దత్తపుత్రుడు జగన్ చెపుతున్నారని యెద్దేవా చేశారు. ఈ పథకాల ద్వారా 10 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. పల్లెలు - పట్టణాలు అనే తేడా లేకుండా గంటల కొద్దీ విద్యుత్ కోతలు అనధికారికంగా అమలు చేస్తోందని ఫైర్ అయ్యారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని వ్యాఖ్యానించారు. తమ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసే ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు తక్కవ ధరకు అమ్మడం, పోరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని జోగయ్య నిలదీసారు.

విద్యుత్ కోతలు - నవరత్నాల పైనా
విద్యుత్ కోతలకు తోడుగా విద్యుత్ చార్జీల పెంపు ఈ ప్రభుత్వం అసమర్ధతకు నిదర్శనమని దుయ్యబట్టారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించి జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలని హరిరామజోగయ్య పిలుపునిచ్చారు. హరి రామజోగయ్య కాపు సంక్షేమ సేన కొద్ది కాలం క్రితం ఏర్పాటు చేసారు. మెగా ఫ్యామిలీ తో సన్నిహిత సంబంధాలు ఉన్న జోగయ్య గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు.

జనసేన గ్యారేజీ దెబ్బ రుచి అంటూ..
గోదావరి జిల్లాల్లో సీనియర్ పొలిటిషీయన్ గా ఉన్న జోగయ్య..ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పదవి కోల్పోయిన వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని తామంతా జగన్ గ్యారేజీలో పని చేస్తామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్ ను సీఎం చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు హరిరామ జోగయ్య జనసేన గ్యారేజీ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఆయన తాజాగా.. సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.












Click it and Unblock the Notifications