సంబంధం లేదు: పొత్తు వ్యాఖ్యలపై హరి, రాఘవులు ఫైర్
హైదరాబాద్: టీడీపీ, బీజేపీ పొత్తుల పైన ఎవరైనా స్పందిస్తే అది వారి స్థాయిగానే పరిగణించాలని, వారి ప్రకటనలతో రెండు పార్టీలకు సంబంధం లేదని విశాఖ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిబాబు గురువారం అన్నారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు ఉండవచ్చునని, వాటితో పార్టీలకు సంబంధం లేదని చెప్పారు. కాగా, ఇటీవల రావెల కిషోర్ పొత్తు పైన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
రాజధాని ప్రాంతంలో రైతులకు వెయ్యి గజాలతో పాటు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులు అనేక కారణాలు చెబుతారని, వారి వినతులన్నింటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. రాజధానికి భూసేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఏపీని 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలన్నారు.
ఈ ఏడాది ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కంభంపాటి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఉమ్మడి ఇంటర్ బోర్డు వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై రాఘవులు నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పోరేట్ శక్తుల్లో చిక్కుకుపోయారని సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. ల్యాండ్ పూలింగుకు తాము వ్యతిరేకమన్నారు. పంట పొలాలను రాజధాని కోసం తీసుకుంటే అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.
కాకినాడ సెజ్ పైన కమిటీ: యనమల
కాకినాడ సెజ్ పైన అధికారిక కమిటీ వేస్తామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా చెప్పారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామన్నారు. త్వరలో కాకినాడలో ఆస్ట్రేలియన్ కంపెనీ చిప్ బిల్డింగ్ యూనిట్ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications