హరి, బాలకృష్ణలే ఆకర్షణ: పలకరింపు, లోకేష్ సందడి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గండిపేటలలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో నందమూరి సోదరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడు కార్యక్రమానికి సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ, హీరో, హిందూపురం శాసన సభ్యులు బాలకృష్ణలు హాజరయ్యారు. నందమూరి సోదరుల హాజరుతో మహానాడు వెలిగిపోయింది!
హరికృష్ణ పార్టీలోని నేతలందరినీ పలుకరిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక మీదకు వచ్చారు. బాలయ్య పలువురిని పలకరించారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు హరికృష్ణ.. చంద్రబాబు, బాలయ్యల పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. టిడిపి అధికారంలోకి వచ్చాక హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు హరి మహానాడుకు హాజరయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు దాదాపు తొలగినట్లేనని భావిస్తున్నారు.

నారా లోకేష్ సందడి
పార్టీ అధ్యక్షులు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మహానాడులో సందడి చేశారు. లోకేష్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరినీ పేరు పేరున పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కలుసుకునేందుకు పలువురు నేతలు పోటీ పడ్డారు.
దివంగత నేత ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు తదితరులు లోకేష్‌ను పలుకరించారు. అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు, బాలకృష్ణతో సహా సీనియర్లు పలువురు వేదిక పైన ఉన్నారు. లోకేష్ వేదిక కింద అందరితో కలిసిపోయారు.












Click it and Unblock the Notifications