గుడిని కూడా ముంచుతున్నారు: బాబుపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: కృష్ణా నది నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెడుతోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా రివర్ బోర్డుకు లేనిపోని ఫిర్యాదులు చేస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. వాస్తవాలతో కృష్ణా బోర్డుకు మేం కూడా లేఖ రాస్తామని హరీష్ రావు అన్నారు.
ఏపీ ప్రభుత్వం సమస్యలను జఠిలం చేస్తూ మొండి పంచాయితీకి, తొండి పంచాయితీకి తెరలేపుతోందని విమర్శించారు. బచావత్ కమిషన్ తీర్పు మేరకే తెలంగాణ ప్రభుత్వం నడుకుంటుందని మంత్రి అన్నారు. ఆదివాసీల బతుకులను బలిగొనే పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేస్తున్నామని, ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఖమ్మంలోని ఏడుమండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారని, ఇప్పుడు బూర్గంపాడుకు ఎసరు పెట్టారని, కిన్నెరసాని ప్రాజెక్టుపై కన్నేశారని హరీష్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచి ఖమ్మం జిల్లాను జల సమాధి చేయాలని చూస్తున్నారని, ఇందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు.

రబీ పంటను కాపాడుకోవడానికి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని, సాగర్ నీటి సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నా ఎపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎపి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ఆయన ఆయన అన్నారు.
ఎపికి ఉన్న నీటి వాటా కన్నా 8 టిఎంసిలు ఇప్పటికే ఎక్కువగా వాడుకుందని ఆయన విమర్శించారు. 321 టిఎంసిలకు గాను 329 టీఎంసిల నీటిని ఎపి వాడుకుంటోందని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఖరీఫ్‌లో ఎక్కువ వాడుకోవడానికి అవకాశం ఇచ్చామని, వాటా కన్నా ఎక్కువ వాడుకుని ఇప్పుడు లెక్కల ముచ్చట వద్దంటున్నారని హరీష్ రావు అన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న 101 టీఎంసిల నీరు తమకే కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోందని, జలాశయాలు ఖాళీ చేస్తూ మొత్తం నీరు తమకే కావాలని అంటోందని, తెలంగాణను ఎండబెట్టాలని చూస్తున్న ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ టిడిపి నేతలు వైఖరి చెప్పాలని ఆయన అన్నారు. టిడిపి నేతలు చంద్రబాబును సమర్థిస్తారా అని ఆయన అడిగారు.
నదీ జలాల విషయంలో రాజీ పడేది లేదని, నీళ్ల దోపిడీని సహించబోమని ఆయన అన్నారు. నిన్నటి దాకా భద్రాచలం గుడి భూములను ముంచారని, ఇప్పుడు గుడిని కూడా చంద్రబాబు ముంచుతున్నారని, పక్క రాష్ట్రం ఏమైనా ఫరవా లేదనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టిడిపి నేతలు తప్పుడు కూతలు మానాలని ఆయన హితబోధ చేశారు.
తెలంగాణ టిడిపి నేతలకు సవాల్
ప్రవీణ్ రావు భూ వ్యవహారంలో తన ప్రమేయం లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని తెలంగాణ టిడిపి నేతలకు సవాల్ విసిరారు. ఈ విషయంలో తన ప్రమేయంపై సాక్ష్యాలు చూపాలని, ప్రమేయం ఉన్నట్లు రుజువైతే ఏ శిక్షకైనా తాను సిద్ధమని హరీష్ రావు తెలిపారు. భూ వివాదాలలో తానెప్పుడూ తలదూర్చలేదన్నారు. టీడీపీ నేతల గురించి ప్రజలకంతా తెలుసునని, వారి ఆరోపణలు నిరాధారమైనవని ఇదివరకే అసెంబ్లీలో రుజువైందని హరీష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications