ముక్కు నేలకు రాయ్: నారా లోకేష్‌కు హరీష్ డిమాండ్
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని, ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌లో తనను నౌకరి ఉండమని ట్విట్టర్‌లో ఫోజులు కొట్టిన ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ముక్కు నేలకు రాయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో తెలంగాణకు అనుకూలమని చెప్పించాలని లేనిపక్షంలో లోకేశ్ గన్ పౌండ్రీలోని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ఆయన అన్నారు. శనివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనను ఆపమనడం దారుణమని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు చిరంజీవి, పురందేశ్వరీ బిజెపి నాయకులను కలిసి తెలంగాణ బిల్లును ఓడించాలని కోరడం తిన్నింటి వాసాలను లెక్కబెట్టుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శనివారం నాటి కిరణ్ ప్రసంగంలో తీవ్ర నిరాశ, నిస్పృహ కనిపించిందని ఎద్దేవా చేశారు.
తూప్రాన్‌లో తెరాస శిక్షణ తరగతులో ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ - తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ - తెలంగాణలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బాబులకు కాలం చెల్లిందని అన్నారు.












Click it and Unblock the Notifications