జీర్ణించుకోలేకపోతున్నారు, ఆపడంలేదు: బాబుపై హరీష్
మెదక్/విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇంకా కుట్రలు పన్నుతూనే ఉన్నారని, విద్యుత్తు ఒప్పందాల రద్దు వంటి చర్యలతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం మండిపడ్డారు.
ఆయన మెదక్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణను అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ప్రస్తుతం విద్యుత్తు సమస్య ఉన్నప్పటీకీ రెండేళ్లలో పూర్తిస్థాయిలో అధిగమిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు.

నాలుగైదు రోజుల్లో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో రూ.18 వేల కోట్ల రైతు రుణాల మాఫీ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా ఇందులో ఉంటాయని హరీష్ రావు చెప్పారు.
త్వరగా సెక్రటీరియట్‌ను తరలించాలి : కావూరి
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇప్పటికీ హైదరాబాద్ నుంచి సాగించడం సముచితంగా లేదని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు అన్నారు. సాధ్యమైనంత త్వరగా సెక్రటేరియట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ఏపీ సర్కార్‌కు ఆయన సూచించారు. తమ సమస్యలు పరిష్కరించుకోవాలంటే హైదరాబాద్‌కు వెళ్లడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కావూరి మీడియాతో మాట్లాడుతూ మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలులో రేకుల షెడ్ వేసుకుని పరిపాలన సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజధాని విజయవాడగానీ లేదా చుట్టు పక్కల ఎక్కడైనా ఆలస్యం చేయకుండా, నెలా, రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు గానీ తాత్కాలిక షెడ్లు వేసైనా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇంకా హైదరాబాద్‌లో ఉండడం న్యాయం కాదని కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications