కిషన్ రెడ్డి చెప్పాలి, కేంద్రం మొండిచేయి: హరీష్ రావు
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెసు, బిజెపి చేసిన విమర్శలపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇస్తుందో చెప్పాలని ఆయన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపితే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆయన విమర్సించారు.

తెలంగాణలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వమే కారణమని ఆయన విమర్సించారు. కరెంట్ కోత లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాదులో గుండాగిరి, భూకబ్జాలు ఉండకుండా చూడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వల్లనే సాధ్యమవుతుందని ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు నేతలు ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కాంగ్రెసు తన వైఖరి స్ఫష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications