నాలుక కోస్తా: తెరాస చీలిక వ్యాఖ్యలపై హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను తాను చీల్చబోతున్నట్లు తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు కూతలు కూస్తే నాలుక కోస్తా అంటూ ఆయన హెచ్చరించారు. తెరాస చీలుతుందని కాంగ్రెసు నాయకుడు దాసోజు శ్రవణ్, హరీష్ రావు తెరాసను చీలుస్తారంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హరీష్ రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారి వ్యాఖ్యలను ఖండించారు.
తెరాస క్యాడర్‌ను అయోమయానికి గురిచేసేందుకు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. చివరిసారిగా హెచ్చరిస్తున్నా, తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తా అని హరీష్ రావు అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన కాంగ్రెసు, టిడిపి నాయకులను హెచ్చరించారు.

తెరాసను ఎవరూ చీల్చలేరని ఆయన అన్నారు. తెరాస చీలిపోతుందంటూ తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు పగటి కలలు కంటున్నాయని ఆయన అన్నారు. తెరాస తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే విషయాన్ని జీర్ణించుకోలేకనే టిడిపి, కాంగ్రెసు నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.
మే 16వ తేదీ తర్వాత పొన్నాల లక్ష్మయ్య సహా కాంగ్రెసు తెలంగాణ ప్రముఖ నాయకులంతా ఇళ్లకే పరిమితమవుతారని ఆయన అన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన అన్నారు. తాను కెసిఆర్ నాయకత్వంలోనే ఉద్యమించానని, కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని హరీష్ రావు అన్నారు.
కెసిఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధన కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. తెరాస అధికారంలోకి రాకుండా చేయాలనే కుట్రలో భాగంగా తెలుగుదేశం, కాంగ్రెసు తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. పొన్నాల ఓ ఫెల్యూర్ పిసిసి అధ్యక్షుడని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెసు నాయకులు కూడా ఇదే అంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications