హైకోర్టు ధిక్కారం - ఏపీలో తహసీల్దార్‌కు రూ.2 వేల ఫైన్- లేకుంటే రెండు నెలల జైలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ కలకలం రేపుతోంది. నేరుగా ప్రభుత్వమే హైకోర్టు విషయంలో ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా హైకోర్టు ఇస్తున్న ఆదేశాలను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో వారిపైనా హైకోర్టు ఇప్పుడు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తోంది.
తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను రోజంతా కోర్టు హాల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. తాజాగా మరో కేసులోనూ తహసీల్దార్‌పై మరింత కఠినంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల హామీల అమల్లో భాగంగా కృష్ణా జిల్లాలో అసైన్డ్ భూములు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తహసీల్దార్ వాటిని అమలు చేయలేదు.

కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ మదన్ మోహన్ రావు అసైన్డ్ భూమిని పేదలకు పంచేందుకు నవరత్నాల అమల్లో భాగంగా తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు మదన్‌మోహన్‌పై సుమోటాగా కేసు నమోదు చేయడమే కాకుండా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. తహసీల్దార్‌కు రెండు వేల రూపాయల జరిమానా విధించింది. అయితే జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.