జగన్ సర్కార్ పై హైకోర్టు కామెంట్స్-ఆ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం-మేం ప్రభుత్వం నడపట్లేదు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై జగన్ సర్కార్ తరచుగా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. అమరావతి రాజధానిపై ఇచ్చిన తీర్పుపై అయితే ఏకంగా అసెంబ్లీలోనే చర్చ పెట్టి అధికార పార్టీ నేతలు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలో, మరో కారణమో తెలియదు కానీ తాజాగా హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న ఓ విధానపరమైన నిర్ణయంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు, జగన్ సర్కార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాల్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో విధాన పరమైన నిర్ణయాల్ని కోర్టులు ఎలా తప్పుబడతాయంటూ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు కూడా. అయితే హైకోర్టు మాత్రం రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గేది లేదనేలా తీర్పులు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యంపై వైసీపీ సర్కార్ పెద్దలు తరచూ అసంతృప్తిగా కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

స్కూళ్ల విలీనంపై హైకోర్టులో పిటిషన్
జగన్ సర్కార్ రాష్ట్రంలో తాజాగా చేపడుతున్న స్కూళ్ల విలీన ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం పావులు కదుపుతోందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి తమ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా విచారణ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వాన్ని నడపలేమన్న హైకోర్టు
ఏపీలో స్కూళ్ల విలీనం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇంగ్లీష్ మీడియం అమలులో భాగంగానే చేస్తున్నట్లు పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో సహజంగా తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రభుత్వాన్ని తాము నడపడం లేదని, తాము ఇక్కడ ఉన్నది ప్రభుత్వాన్ని నడపడం కోసం కాదని పేర్కొంది. తద్వారా ప్రతీ ప్రభుత్వ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications