ఏపీలో వర్షాలపై అప్‌డేట్- కరవు తీరేలా
అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో కిందటి నెలలో ఓ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. ఆ తరువాత ముఖం చాటేశాయి. ఎండ తీవ్రత వేసవిని తలపించింది కొన్ని ప్రాంతాల్లో. అడపా దడపా వర్షాలు పడినప్పటికీ- గత ఏడాదితో పోల్చుకుంటే చాలా తక్కువే. జూన్ నెలలో 37 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. బంగాళాఖాతం గగనతలంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 10, 11వ తేదీల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

బంగాళాఖాతం ఉత్తర- మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఈ ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ఫలితంగా వచ్చే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మన్యం పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిస్తాయని తెలిపింది.
కిందటి నెలతో పోల్చుకుంటే ఈ నెలలో రాష్ట్రంలో గణనీయమైన వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వచ్చే కొద్ది రోజుల్లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.












Click it and Unblock the Notifications