ఏపీలో భారీ వర్షాలు: మరో రెండు రోజులపాటు, ఆ జిల్లాలకు అలర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరో రెండు రోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీర ప్రాంతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని, దీంతోపాటు ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
బుధవారంనాడు అల్లూరి సీతరామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారంనాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో ని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లోకి వెళ్లే రైతులు, బయటకు వెళ్లే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, మంగళవారంనాడు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పలుచోట్ల కుండపోత వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రాకపోకలతకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కావలి, వెంకటాపురం, కోవూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications