ఏపీకి బంగాళాఖాతం భారీ హెచ్చరిక, రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీవర్షాలు!
తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత పెరిగింది. ఒకపక్క చలి చంపేస్తుంటే, మరోపక్క వర్షాలు మాత్రం తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. నవంబర్ మాసంలో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అన్నదాతలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇక తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం ఏపీలో వాతావరణం పైన మరొక కీలక అలర్ట్ ను ఇచ్చింది.
ఏపీలో మళ్ళీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉందన్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వెళ్ళకూడదని సూచనలు చేశారు.
ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, మత్స్యకారులకు అలెర్ట్
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ , దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మళ్ళీ మరో అల్పపీడనం అవకాశం.. మళ్ళీ వర్షాలకు ఛాన్స్
ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మరోవైపు నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం దీని ప్రభావంతో నవంబర్ 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications