వాయుగుండంతో అతిభారీ వర్షాల హెచ్చరిక పంపి వణికిస్తున్న బంగాళాఖాతం!
వర్షాకాలం పూర్తయి చలికాలం ప్రారంభమవుతున్నా వర్షాలు మాత్రం వదలడం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని, ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని ఐఎండి అమరావతి విభాగం పేర్కొంది.
వాయుగుండం ఎఫెక్ట్... మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు
దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటలలో వాయుగుండం గా మారుతుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు.

వర్షాలు కురిసే జిల్లాలవారు అప్రమత్తంగా ఉండాలి
ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఇదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వర్షాలు కురిసే జిల్లాలవారు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్
మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అధికారులతో సమీక్ష జరుపుతున్న హోం మంత్రి వంగలపూడి అనిత
ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి? తదితర వివరాలు అధికారులు అనితకు వివరించారు.
ఈ జిల్లాలలో కంట్రోల్ రూమ్ లు
సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో వర్షాలు కురుస్తున్న, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications