ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏమీ వ్యాఖ్యానించకపోయినప్పటికీ వైసీపీ వర్గాలు మాత్రం అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే పలుమార్లు తమ పార్టీ శ్రేణులకు ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయంటూ బహిరంగంగానే చెప్పేశారు. అందుకు తగ్గట్లుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా క్యాడర్‌ను సంసిద్ధులను చేస్తున్నారు.

గడప గడప తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావొచ్చు?
రాష్ట్రంలో ప్రస్తుతం గడప గడపకు ప్రభుత్వం పేరుతో కార్యక్రమం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులకు పలుచోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. అయినా సంవత్సర సమయం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం ముగిసేలోపే పర్యటనలో పాల్గొన్నవారంతా రాష్ట్రంలోని పార్టీ బలాబలాలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందిస్తారు. దాన్ని బట్టి జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలు వస్తాయనేదానికి సూచనగా ఏపీలో మరో కార్యక్రమం కూడా రూపుదిద్దుకుంది. మంత్రులంతా జయహో జగనన్న పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.

26 నుంచి బస్సు యాత్ర
మే 26వ తేదీ నుంచి 29వ తేదీవరకు జరిగే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను స్పృశిస్తూ ఈ యాత్ర సాగబోతోంది. పలు ప్రాంతాల్లో బహిరంగసభల్లో మంత్రులు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం జగనన్న ఏం చేశారు.. చేస్తున్నారు.. చేయబోతున్నారు అనేది వీరంతా ప్రజలకు వివరించి చెప్పబోతున్నారు.

వచ్చే నెలలో మరో ప్రకటన?
ఇప్పటికే బస్సు యాత్రకు రెండు బస్సులు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలో ప్రారంభమై అనంతపురంలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి జగన్ మరో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని, వచ్చే నెలలో దాన్ని ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications