ఖాళీగా కూర్చోవడం ఒక రకమైన వ్యాధి బాలకృష్ణ
ఏ పనిచేయకుండా ఖాళీగా కూర్చోవడం ఒకరకమైన వ్యాధి అని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రముఖ నటి ఎల్.విజయలక్ష్మికి హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎల్.విజయలక్ష్మికి ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని, శక పురుషుడి శత జయంతి వేడుకలు చేయడం తనకు సంతృప్తిగా ఉందన్నారు.
విజయలక్ష్మి 110కు పైగా సినిమాలు చేస్తే అందులో 60 సినిమాలు ఎన్టీఆర్ తో చేశారన్నారు. తన నృత్యం, తన నటనతో ఆమె ఎంతోమందిని అలరించారన్నారు. నటించడం విరమించిన తర్వాత సీఏ చేసి వర్జీనియా యూనివర్సిటీలో కీలక పదవిలో కొనసాగుతున్నారన్నారు. అవకాశాలు రాకపోవడంవల్ల సినిమావాళ్లు ఒత్తిడికి లోనవడం సహజమని, అయితే ఏ పనిచేయకుండా ఖాళీగా ఉండటం కూడా ఒకరకమైన వ్యాధి అన్నారు. భావితరాలకు విజయలక్ష్మి ఆదర్శనీయమన్నారు.

తనని పిలిచి ఇంత అభిమానంతో సన్మానం చేయడం సంతోషంగా ఉందని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని విజయలక్ష్మి అన్నారు. తాను ఎన్టీఆర్‌ను ఆరాధిస్తూ పెరిగానని, జీవితంలో మరింత ముందుకు వెళ్లానంటే అందుకు ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విలువలే కారణమని వెల్లడించారు. నిబద్ధతకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనమని, ఆయనతో కలిసి నటించే సమయంలో చాలా భయపడేదానినన్నారు. అయితే, ఎన్టీఆర్ మాత్రం చాలా సౌకర్యంగా చూసుకునేవారని విజయలక్ష్మి ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు