జగన్ ప్రతినిధిగా విజయసాయి: హెటిరో, ‘ఈడీ కేసులో మినహాయింపు కోరిన జగన్’

హైదరాబాద్: జడ్చర్ల సెజ్‌(ప్రత్యేక ఆర్థిక మండలి)లో 75 ఎకరాలను కేటాయించాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పెట్టుబడుల గురించి కలిశారని హెటిరో గ్రూపు డైరెక్టర్‌ ఎం శ్రీనివాసరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చారు.

1998 నుంచి వైయస్ రాజశేఖర్‌రెడ్డి తెలుసని, 2006లో జడ్చర్ల సెజ్‌లో ఎకరాకు రూ.7 లక్షల చొప్పున 35 ఏళ్లకు లీజుగా 75 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. జగన్‌ తరఫున తాను వచ్చానని సాయిరెడ్డి చెప్పారని, పెట్టుబడులు ఎందుకు పెట్టాలన్నదానిపై వివరించారని తెలిపారు.

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌లపై సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.. నిందితుల వాంగ్మూలాలు సేకరించింది. పెట్టుబడుల వ్యవహారాలన్నీ సాయిరెడ్డి చూస్తుంటారని జగన్‌ వాంగ్మూలంలో తెలిపారు.

తన సలహాతోనే సోదరుడు ప్రసాద్‌రెడ్డి, భార్య కె రాజేశ్వరి, అల్లుడు పి శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ)లు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు అరబిందో ఫార్మా డైరెక్టర్‌ నిత్యానందరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. మెదక్‌ జిల్లా పాశమైలారంలో అరబిందోకు కేటాయించిన భూమిని ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు బదలాయించడంపై ఈడీ వివరాలు రాబట్టింది.

 Hetero in ED case

హాజరు మినహాయింపు కోరిన జగన్‌

జగన్‌ ఆస్తుల కేసు విచారణలో భాగంగా నిందితులు ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో సోమవారం తొలిసారి హాజరయ్యారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఫార్మా కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ విచారణ కొనసాగుతోంది.

కాగా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున హాజరు మినహాయింపు కోరుతూ ప్రధాన నిందితుడైన జగన్మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తం నిందితులు 19 మంది ఉండగా అందులో జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రాల తరఫునా జగన్‌ హాజరు కావాల్సి ఉంది. హాజరైన వారిలో వి.విజయసాయిరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి (హెటిరో డైరెక్టర్‌), కె.నిత్యానందరెడ్డి (అరబిందో ఎండీ) తదితరులున్నారు.

నిందితుల హాజరును నమోదు చేసుకున్న జడ్జి టి రజని తదుపరి విచారణను ఏప్రిల్‌ 26కు వాయిదా వేశారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా అరబిందో, హెటిరో గ్రూపులు జగన్‌ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రాల్లో రూ.29.50 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ చేసిన ఫిర్యాదుపై ఈ విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+