పవన్, శివాజీ ఒకే గూటి పక్షులా: ఎవరి చేతిలో అస్త్రాలు?
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై గొంతు విప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టించారు. ఆ వేడికి హీరో శివాజీ ఆజ్యం పోసినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదాపై తిరుపతి సభలో గళమెత్తిన మరుక్షణం నుంచి శివాజీ రెచ్చిపోతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మరోవైపు, ఈ నెల 9వ తేదీన పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది.
పవన్ కల్యాణ్ వ్యూహమేమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారా, బిజెపి వైపు ఉన్నారా, లేదంటే ఇరు పార్టీలను కాదని ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. శివాజీ మాత్రం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శివాజీ హెచ్చరించారు.
అదే సమయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి రాష్ట్రానికి శనిలా దాపురించాడని వ్యాఖ్యానించారు. అయితే, శివాజీపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. శివాజీపై జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొండా ఉమామహేశ్వర రావు వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస పెట్టి ధ్వజమెత్తుతున్నారు.

పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారు. పైగా, పవన్ కల్యాణ్ కాకినాడ సభకు మద్దతిస్తూ బొండా ఉమామహేశ్వర రావు పోస్టర్లు కూడా వెలిశాయి. పవన్ కల్యాణ్ హోదా డిమాండ్‌కు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే, లోలోపల వారిని ఒకరకమైన ఆందోళన పీడిస్తున్నట్లే ఉంది.
బిజెపి వ్యూహంలో భాగమేనా...
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు, ఎవరికీ అర్థం కావడం లేదు. బిజెపికి మద్దతుగా నిలబడుతారా అంటే అదీ కాదనిపిస్తోంది. హోదా విషయంలో ఆయన ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు.అయితే, పవన్ కల్యాణ్‌ను బిజెపియే రంగంలోకి దింపిందనే ప్రచారం కూడా సాగుతోంది. క్రెడిట్ చంద్రబాబుకు వెళ్లకుండా పవన్ కల్యాణ్ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందనే అభిప్రాయాన్ని కల్పించడానికి బిజెపి ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమైనట్లు చెబుతన్నారు. ఈనెల 9వ తేదీ కాకినాడ సభ వేడి తర్వాత కేంద్రం ఆ ప్యాకేజీ ప్రకటించి క్రెడిట్ పవన్ కల్యాణ్‌కు వెళ్లేలా చూడాలనేది బిజెపి వ్యూహమని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుని పవన్ కల్యాణ్‌తో కలిసి నడవడానికి ఈ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.
మొదట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధపడినప్పటికీ బిజెపి తర్వాత వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌పై ఉన్న కోర్టు కేసుల కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుని పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపారని అంటున్నారు.
ముద్రగడ కాపు సభకు విరుగుడా...
పవన్ కల్యాణ్ విషయంలో మరో ప్రచారం కూడా ాసగుతోంది. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ చేసే పోరాటానికి విరుగుడుగానే పవన్ కల్యాణ్ ఈ నెల 9 తేదీన కాకినాడ సభను తలపెట్టారని అంటున్నారు. సెప్టెంబర్ 11వ తేదీన ముద్రగడ జెఎసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన కాపు రిజర్వేషన్ల సాధనకు పోరాట కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముద్రగడ ఇప్పటికే దాసరి నారాయణ రావు, బొత్స సత్యనారాయణ, చిరంజీవి తదితరులను కలిశారు. వారు ముద్రగడకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా కాకినాడలో రంగంలోకి దిగుతున్నారనే మాట వినిపిస్తోంది. తనను ఒక్క కులానికి అంటగట్టవద్దని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని బట్టి ఆ వాదన చేస్తున్నారు.
మరి శివాజీ ఏమిటి...
పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై గళమెత్తగానే రంగంలోకి దిగిన శివాజీ ఎవరి కోసం పనిచేస్తున్నారనేది కూడా ఆసక్తికరంగానే మారింది. ఆయనకు ప్రస్తుతం వామపక్షాల మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు.
అయితే, గతంలో శివాజీ ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి చంద్రబాబు అనుకూలంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. శివాజీ గతంలో బిజెపిలో చేరి, బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించుకున్నారు. ఆ సమయంలో ఆయన ప్రత్యేక హోదాపై బిజెపి తీరును కూడా విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ ఒక్కటేనా..
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, పవన్ కల్యాణ్, శివాజీ ఒక్కటేనని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీపైకి బిజెపి ఎక్కుపెట్టిన అస్త్రాలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కొసమెరుపు ఏమిటంటే, ఈ ఇద్దరు కూడా వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృతీయ ఫ్రంట్ కడుతారా అనేది కూడా కొట్టి పారేయలేని విషయమే.
ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ పవన్ కల్యాణ్ వామపక్షాల పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు. తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలను విశ్వసిస్తాను కాబట్టి ఆ పార్టీల నాయకులను ఏమీ అనదలుచుకోలేదని తిరుపతి సభలో చెప్పారు. శివాజీకి మాత్రం సిపిఐ మద్దతు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇంకా కొంత కాలం ఆగితే తప్ప ఈ ఇరువురి గురించి స్పష్టత వచ్చే అవకాశం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications