తిరుమలలో హై అలర్ట్.. ఆ వస్తువులు తీసుకెళ్తే ఇక జైలుకే..?
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీలను తిరిగి ఆ దేశం పంపించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నిఘాను పటిష్ఠం చేశారు. ఈ మేరకు తిరుమలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజాగా తిరుమలలో క్యాబ్‌లు నడుపుతున్న 400 మంది డ్రైవర్లు, 50 మంది ఓనర్లతో టీటీడీ దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత కోసం ఎలా వ్యవహరించాలనే దానిపై ఆయన క్యాబ్ డ్రైవర్లతో భేటీ అయ్యారు. ఈమేరకు ఎవరు అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. నిషేధిత వస్తువులు తిరుమలలో అనుమతి లేదని.. వాటిని ఎవరైనా తీసుకురావాలని ప్రయత్నించినా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు. ఈ మేరకు తిరుమలలో ఎలా నడుచుకోవాలన్న దానిపై క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
అంతేకాక దొంగలు.. ఇతర నేరస్థులు తమ వాహనాలను ఎక్కినట్లు క్యాబ్ డ్రైవర్లు గుర్తిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని హర్షవర్ధన్ రాజు సూచించారు. ఇక తిరుమలలో క్యాబ్‌లు, వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు తిరుమలలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాక తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య జంక్షన్ లలో బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేస్తున్నారు. ఆలయాల దగ్గర భద్రతనూ పెంచారు. అన్ని వాహనాల తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్ల మండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి సారిం చారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.


Click it and Unblock the Notifications