ఏపీకి తుఫాను గండం.. కోస్తాతీరంపై ప్రభావం.. నేడు ఈ జిల్లాలలో వర్షాలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం కారణంగా, చత్తీస్గడ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది.
మే 22 నుండి 27 వరకు బలమైన తుఫాను వచ్చే అవకాశం
ఇక నేడు ఏపీలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. వచ్చే వారం మే 22 నుండి 27 వరకు బలమైన తుఫాను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ నుండి వైజాగ్ నుండి పూరి వరకు కోస్తా తీరం ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు అందుకు సిద్ధం కావాలని అంటున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం వలన వర్షాలు కురుస్తాయని అంటున్నారు.
నేడు ఏపీలో ఈ జిల్లాలలో వర్షం
నేడు సత్యసాయి, వైయస్సార్ కడప, అన్నమయ్య జిల్లా,చిత్తూరు జిల్లా,తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు ల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం,అల్లూరి జిల్లా,మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా,కాకినాడ జిల్లా,ఉభయగోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లా ,కృష్ణా జిల్లా,నెల్లూరు జిల్లా, కర్నూలు,నంద్యాల జిల్లా,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు.
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు
శాటిలైట్ దృశ్యాల ఆధారంగా నేడు కోస్తాంధ్ర, మధ్య రాయలసీమలలో జల్లులు పడతాయి. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఏపీ తీరం వెంట వాన పడుతుంది. మరోవైపు మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలోను, తిరుపతిలోనూ ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. సాయంత్రం ఐదు దాటిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తీరం వెంట తప్ప మిగతా చాలాచోట్ల వర్షం కురుస్తుంది. దక్షిణ రాయలసీమలో, రాత్రి 7 గంటల తర్వాత పశ్చిమ రాయలసీమలో మోస్తరు వర్షపాతం పడుతుంది.
ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు
ఇదిలా ఉంటే ఇక భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో ఏడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పిడుగులు పడే అవకాశం ఉందని, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గా ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications