రాజధానికి రూ.10 వసూలుపై బాబుకు హైకోర్టు షాక్, ఎంసెట్ తేదీ మార్పు
హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బుధవారం చుక్కెదురయింది. ఏపీ విద్యాశాఖ నిర్ణయం పైన హైకోర్టు స్టే విధించింది.
రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ రెండు రోజుల క్రితం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేయాలని, తద్వారా రాజధాని నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కూడా ఉండేలా అవకాశం కల్పించాలని భావించింది.
రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ శాఖ పరిధిలో మొత్తం 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే దాదాపు మూడు లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

అయితే, అందరి నుంచి డబ్బులు వసూలు చేయడం కాకుండా.. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మాత్రమే తలా రూ.పది చొప్పున ఈ నెల పదో తేదీలోగా సేకరించనున్నారు.
మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నుంచి అందిన ఆదేశాలను అనుసరించి జిల్లాలకు ఈ మేరకు సమాచారాన్ని సోమవారం పంపినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అయితే, దీనిపై హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది.
ఎంసెట్ తేదీ మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ తేదీ మారింది. మే 5వ తేదీకి బదులు ఏప్రిల్ 29వ తేదీనే ఎంసెట్ నిర్వహించనున్నారు. కెసెట్ కారణంగా ఎంసెట్‌ను ఆరు రోజులు ముందుకు జరిపారు.












Click it and Unblock the Notifications