పుట్టపర్తిలో హై టెన్షన్: సత్యప్రమాణాలకు సిద్ధమైన పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి!!
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హై టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటూ వైసిపి, టిడిపి నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే అవినీతిపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ ఇరువురు నేతల మధ్య సత్యమ్మ ఆలయంలో ప్రమాణాల దాకా వెళ్ళింది.
పుట్టపర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభివృద్ధి జరిగిందని, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి లోని సత్యమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే గా నువ్వు కూడా సిద్ధమా అంటూ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కి సవాల్ విసిరారు. మీ అవినీతిని నిరూపిస్తా.. నా అభివృద్ధిని చూపిస్తా అంటూ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పై వ్యాఖ్యలు చేశారు.

సత్యమ్మ ఆలయం వద్ద సత్య ప్రమాణాలకు రెడీ
పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తిని తామే అభివృద్ధి చేశామని, పుట్టపర్తి అభివృద్ధిపై పేటెంట్ హక్కులు తమకే ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం 10 గంటలకు తాజా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి సత్యమ్మ ఆలయం వద్ద ప్రమాణాలకు సిద్ధం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పుట్టపర్తిలో ఏప్రిల్ 30వ తేదీ వరకు 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని, చర్చలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్తున్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. నేడు సత్య ప్రమాణాలకు ఇరువురు నేతలు సిద్దమైన నేపథ్యంలో ఇరువురిని హౌస్ అరెస్ట్ చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు అడ్డుకున్నా చర్చకు సిద్ధమన్న పల్లె రఘునాథ్ రెడ్డి
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చర్చకు వచ్చి తీరుతామని చెబుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రలో గత నాలుగేళ్లలో పుట్టపర్తిలో జరిగిన అవినీతి గురించి మాట్లాడారు. కానీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని ఎక్కడ వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పకొచ్చారు. కానీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనను, లోకేష్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అంటూ మండిపడ్డారు. మంచి చెబితే నేర్చుకుంటానని, విమర్శిస్తే ఓర్చుకుంటానని, నారా లోకేష్ ను ఏమైనా అంటే మాత్రం తేల్చుకుంటానంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పై విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications