తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా ?
కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపధ్యంలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ అమలు చేస్తుండగా.. శాంతిభద్రతల సమస్య కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడగా.. ఇప్పుడు మళ్లీ మూడోసారి కూడా వాయిదా పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం సమీపంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందే నేతలు ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఇక మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ క్రమంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కోల్పోతోంది.
తాజాగా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియకు 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి మిగిలిన కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రీసెంట్ గానే పులివెందుల మున్సిపాలిటీలో కూడా ఒక కౌన్సిలర్ టీడీపీలో చేరడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications