అప్పుడే భానుడి భగభగ.. ఉష్ణతాపం, ఉక్కపోతతో ఏపీవాసులు విలవిల!!
ఎండాకాలం ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే విపరీతంగా ఎండలు పెరగడం ఏపీ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడే ఎండల దాడి ఈ విధంగా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతుంది. ఉదయం 10 దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు వణికిపోతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫిబ్రవరి మొదటివారం నుంచి విపరీతంగా ఉన్న ఎండలు ఫిబ్రవరి మూడో వారానికి పీక్స్ కు చేరుకున్నాయి అంటే నమ్మి తీరాల్సిందే.కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఇప్పుడే బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 10 దాటితే బయటకు వచ్చి పనులు చేసుకోలేక పోతున్నామని లబోదిబోమంటున్నారు.

సాధారణంగా ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట 35 డిగ్రీలకు మించి ఉండదు. కానీ ప్రస్తుతం ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు ఉంటుందంటే ఈసారి ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే మూడు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా రికార్డు అవుతున్నాయి.
నిన్న అనంతపురంలో 39 డిగ్రీలు, నంద్యాల, వైయస్సార్, కర్నూలు జిల్లాలలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక చాలా చోట్ల సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం ఏపీపై ఉందని దీనివల్ల ఉష్ణతాపం, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం లేకపోలేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈసారి వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉష్ణతాపంతో పాటు తీవ్ర వడగాలులు తప్పే పరిస్థితి లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications