హిజ్రాల కోసమే ప్రత్యేకంగా ఆధార్ సీడింగ్ కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారిగా రేషన్ కార్డుల మంజూరు,
రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాలో హిజ్రాలకు రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాలో హిజ్రాలకు రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రేషన్ కార్డు మంజూరు కావాలంటే ఆధార్ తప్పనిసరి కావడంతో హిజ్రాలు ఎక్కువగా నివసిస్తున్న వికలాంగుల కాలనీలో వారికోసమే ప్రత్యేకంగా ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు అనంతరం హిజ్రాల చేత రేషన్ కార్డులకు ధరఖాస్తు చేయించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల స్ఫూర్తితో
గుంటూరు జిల్లా అధికారులు ముందడుగు వేశారు. తాము అందరిలా జీవించేందుకు అవకాశం కల్పించాలన్న ట్రాన్స్ జెండర్ల వేడుకోలుతో చలించిపోయిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హిజ్రాలకు మిగతా లబ్థిదారులలాగానే అన్నిసంక్షేమ పథకాల ఫలాలు వీరికి కూడా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ సంక్షేమ పథకం పొందాలన్నా రేషన్ కార్డు అర్హతగా ఉండటంతో ముందుగా హిజ్రాలకు రేషన్ కార్డు ఇప్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు హిజ్రాలకు రేషన్ కార్డుల మంజూరుకు డిఎస్ఓ చిట్టిబాబు యుధ్దప్రాతిపదికన చర్యలు ఆరంభించారు.

జిల్లాలోనే హిజ్రాలు ఒకే చోట
గుంటూరు జిల్లాలోనే హిజ్రాలు ఒకే చోట ఎక్కువమంది నివసిస్తున్న ప్రాంతం నగరంలోని వికలాంగుల కాలనీ. తమ సంక్షేమం గురించి పట్టించుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ను కలిసింది కూడా ఇక్కడివారే. దీంతో ముందుగా ఇక్కడి హిజ్రాలకు రేషన్ కార్డులు మంజూరు చెయ్యాలని డిఎస్ఓ శ్రీకారం చుట్టారు. అయితే ఎవరికైనా రేషన్ కార్డ్ మంజూరు కావాలంటే ముందుగా ఆధార్ సీడింగ్ తప్పనిసరి. అయితే ఇక్కడివారిలో చాలా మంది హిజ్రాలకు ఆధార్ కార్డ్ లు లేవు. దీంతో వారికి ఆధార్ కార్డ్ ఇప్పించేందుకు వికలాంగుల కాలనీలో ఆధార్ సీడింగ్ కేంద్రం ఏర్పాటుచేసేలా కార్వీ అర్బన్ సంస్థతో మాట్లాడారు. అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన కార్వి సంస్థ వికలాంగుల కాలనీలో హిజ్రాల కోసమే తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమస్యల పరిష్కారంపై
అయితే హిజ్రాలకు ఆధార్ నమోదులో పలు ఇబ్బందులు ఉండటంతో ఈ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆధార్ నమోదు ప్రారంభమైన కొత్తలో హిజ్రాల కోసం ప్రత్యేక కాలమ్ లేదు. దీంతో హిజ్రాలలో ఆధార్ కార్డు ఉన్నవారు కూడా కొందరు పురుషులుగా, మరికొందరు స్త్రీలుగా నమోదుచేసుకున్నారు. అయితే ఇటీవలే హిజ్రాలను ట్రాన్స్ జెండర్లుగా గుర్తించాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. జెండర్ విభాగంలో మేల్ ఫిమేల్ తో పాటు ట్రాన్స్ జెండర్ కాలం జత చేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లో ఆధార్ కార్డ్ లలో స్త్రీలుగా,పురుషులుగా నమోదైనవారు మళ్లీ ట్రాన్స్ జెండర్ గా సవరణ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

గుంటూరు వికలాంగుల
ఈ నేపథ్యంలో గుంటూరు వికలాంగుల కాలనీలో హిజ్రాల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం వద్ద కలెక్టర్ దిశానిర్ధేశంతో డిఎస్ఓ చిట్టిబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. హిజ్రాల ఆధార్ కార్డ్ ల సవరణతో పాటు అవి లేని వారు నూతన ఆధార్ కార్డ్ లు పొందేందుకు వీలుగా అవసరమైన ధృవపత్రాలను అక్కడికక్కడే ఇచ్చేందుకు ఆర్ ఐ, విఆర్ వో లను ఇక్కడికే రప్పించారు. హిజ్రాల వివరాలను పరిశీలించి ఆయా అధికారులు అప్పటికప్పుడే రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీచేశారు. వాటి ఆధారంగా కార్వీ సిబ్బంది ఆధార్ నమోదు చేయడం సాధ్యపడింది. అనంతరం అప్పటికే ఆధార్ ఉన్నహిజ్రాలతో రేషన్ కార్డులకు ధరఖాస్తు చేయించారు ఢిఎస్ఓ చిట్టిబాబు.

చిట్టిబాబు మాట్లాడుతూ హిజ్రాలకు
ఈ సందర్భంగా డిఎస్ఓ చిట్టిబాబు మాట్లాడుతూ హిజ్రాలకు సామాజిక ఫించన్లు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారని, తమ సంక్షేమం పై హిజ్రాలు చేసిన విన్నపాలపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎన్ టి ఆర్ గృహనిర్మాణ పథకం క్రింద ఇల్లు పొందాలన్నా హిజ్రాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి తెల్లరేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.












Click it and Unblock the Notifications