కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ వైజాగ్ లో నిరసనలు..! పహల్గాం దాడి ఎఫెక్ట్..!
కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాకిస్తాన్ పై ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్రం దాడి చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ లోని కరాచీ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ విశాఖలో ఇవాళ నిరసనలు జరిగాయి. పహల్గాం దాడి నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరి పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ విశాఖలో హిందూ జన జాగరణ సమితీ నిరసనలు చేపట్టింది. ఈ గ్రూపు కార్యకర్తలు కరాచీ బేకరి వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. వాటిలో కరాచీ పేరు తొలగించి భారత్ ను గౌరవించాలనే నినాదాలు ఉన్నాయి. జాతీయ జెండాలతో జాగరణ సమితి కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. కాసేపు నిరసనల తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇప్పటివరకూ భారత్-పాక్ మధ్య ఎన్ని విభేదాలున్నా, యుద్దాలు కూడా జరిగినా కరాచీ బేకరి పేరు మార్పు డిమాండ్ మాత్రం ఎక్కడా వినిపించలేదు. కానీ ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత మాత్రం ఇలా కరాచీ బేకరీ పేరుపై కూడా హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా నిరసనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే నిరసన శాంతియుతంగానే సాగడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై పరిమితంగా అయినా దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతోనూ సమావేశమయ్యారు. ఇవాళ రక్షణ కార్యదర్శితోనూ భేటీ అయ్యారు. పాకిస్తాన్ పై యుద్దసన్నద్దతను వారితో చర్చించారు.












Click it and Unblock the Notifications